మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలకం
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు
రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి
బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం చంద్రబాబు మద్దతు
కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామితో ఢిల్లీలో ముఖ్యమంత్రి మీడియా సమావేశం
ఢిల్లీ, నవంబర్ 27: మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాలను పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఈ కీలక నిర్ణయాలకు మద్దతు తెలిపేందుకే ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, ఇతర కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారని, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. మహిళా సాధికారతకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి వివరించారు.
జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం పెరగాలి
1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని, ఆ తర్వాత కూడా పాత జనాభా ప్రాతిపదికనే లోక్‌సభ స్థానాల సంఖ్య కొనసాగుతోందని చంద్రబాబు వివరించారు. అప్పట్లో దేశ జనాభా 58.8 కోట్లుగా ఉండగా, లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశ జనాభా సుమారు 147 కోట్లకు చేరుతున్న నేపథ్యంలో అదే 543 స్థానాలతో కొనసాగడం సమంజసం కాదన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరగాలని అభిప్రాయపడ్డారు. 1971లో ప్రతి పది లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుమారు 27 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచితే ప్రతి 18 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను పార్లమెంటులో సమర్థంగా ప్రస్తావించేందుకు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.
దక్షిణాది ప్రయోజనాలకు భంగం కలగదు
జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు గతంలో దేశానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ప్రచార కార్యక్రమాల ద్వారా సంతానోత్పత్తి రేటును తగ్గించగలిగామని వివరించారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, జనాభా నియంత్రణతో పాటు జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో 2026 జనాభా లెక్కలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఈ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో నష్టపోకూడదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న స్థానాలపై 50 శాతం అదనపు సీట్లు పెంచే విధానం తీసుకురావడం సముచితమన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు కూడా పూర్తి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రజల్లో అనవసరమైన అసంతృప్తి, ఆందోళనలు తలెత్తకుండా, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఏపీకి 25 నుంచి 38 స్థానాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని, 50 శాతం సీట్ల పెంపు జరిగితే ఆ సంఖ్య 38కి చేరుతుందని చంద్రబాబు వివరించారు. తమిళనాడులో 59, కర్ణాటకలో 42, తెలంగాణలో 26, కేరళలో 30కి లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల సంఖ్య 195కు చేరుతుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజాప్రాతినిధ్యం విస్తరిస్తుందని చెప్పారు. 2001 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూడా జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రాతినిధ్యం పెరగలేదని, ప్రస్తుతం ప్రతి ఎంపీపై అధిక జనాభా భారం ఉందని వివరించారు. కొత్త డీలిమిటేషన్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉందని, మహిళా రిజర్వేషన్ల అమలుకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు ఎన్టీఆర్ పునాది
మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని చంద్రబాబు గుర్తుచేశారు. 1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో వారి భాగస్వామ్యానికి పునాది వేశారని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేశానన్నారు. నేడు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు 'స్వయం' బ్రాండ్‌ను తీసుకొచ్చామని, వాటిని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు పెంచడంతో పాటు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాల్లోనూ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పటి నుంచి వారి రాజకీయ భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పది మేయర్ స్థానాల్లో ఎనిమిది స్థానాలను మహిళలు గెలుచుకున్నారని చెప్పారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు నగరాల ప్రథమ పౌరులుగా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమన్నారు.
దేశ భవిష్యత్తుకు మహిళల భాగస్వామ్యం కీలకం
మహిళా రిజర్వేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై తమ ప్రభుత్వం నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోందన్నారు. ప్రధాని మోదీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని, ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశ మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ హయాంలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా వివిధ కారణాలతో ఆమోదం పొందలేకపోయిందని గుర్తుచేశారు. గత సమావేశాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయని, అలాంటి తప్పిదాలు మరోసారి జరగకూడదని విజ్ఞప్తి చేశారు. మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు దానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంటు సమావేశాల్లో సభ్యులంతా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రక తప్పిదానికి పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. భారతీయులు సాంకేతికత, నాయకత్వ రంగాల్లో ఇప్పటికే ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని, దేశం మరింత ముందుకు వెళ్లాలంటే సమర్థవంతమైన మహిళా నాయకత్వం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించినప్పుడే మహిళలు దేశ అభివృద్ధిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించగలరన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలన్న ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు తిరస్కరిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ ప్రయోజనాలు, మహిళల భవిష్యత్తు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య విస్తరణను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
