👉వచ్చే ఏడాది పోలవరం పూర్తి.. గోదావరి పుష్కరాలకు సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులకు ఆహ్వానం
👉ప్రభుత్వ కేసుల సత్వర పరిష్కారానికి త్వరలోనే ‘లీగల్ ఏఐ స్టాక్’ అమలు చేస్తామని వెల్లడి
రాజమహేంద్రవరం: తాటి చెట్ల ఆకులపై తీర్పులు రాసే స్థాయి నుంచి నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగించే స్థాయి వరకు భారత న్యాయ వ్యవస్థ అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందని సిఎం నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. శనివారం నాడు రాజమహేంద్రవరంలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా కోర్టు 222వ వార్షికోత్సవం, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా కోర్టుకు, బార్ అసోసియేషన్‌కు సీఎం అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ లాగే ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ కూడా ప్రజల హక్కుల కోసం అదే స్థాయిలో పనిచేస్తోందని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఆదికవి నన్నయ్య, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహోన్నతులు ఈ నేలను పునీతం చేశారని సీఎం గుర్తుచేశారు. ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ వల్లే ఉభయగోదావరి జిల్లాల డెల్టా సస్యశ్యామలమై రాష్ట్రానికి అన్నపూర్ణగా మారిందన్నారు. న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు అపర ధైర్యశాలి అని కొనియాడారు. ఇదే రాజమండ్రి బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ చేసిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా ఎదగడం గర్వకారణమన్నారు. అలాగే, ప్రజాకోర్టుగా పేరుగాంచిన సీతానగరం రచ్చబండ కోర్టు 1849లోనే అధికారిక గుర్తింపు పొందిందని వివరించారు.
గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, చారిత్రక తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌ను, రాజధాని అమరావతిని కాపాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఏపీకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్రపుటల్లోకి ఎక్కారని పేర్కొంటూ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కూడా త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుందని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్నాయని, ముఖ్యమంత్రిగా మూడోసారి ఈ మహోత్సవాన్ని నిర్వహించే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించాల్సిందిగా సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులందరినీ ఆయన సాదరంగా ఆహ్వానించారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో చిక్కుకున్నా.. ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలు పటిష్టంగా ఉండటం వల్లే భారత్ స్థిరంగా నిలబడిందని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దేశం 'వికసిత్ భారత్'గా, ఆంధ్రప్రదేశ్ 'స్వర్ణాంధ్ర'గా మారడం ఖాయమన్నారు. పౌరపాలన, పన్ను వసూళ్లలో ఏఐ సాంకేతికతను వినియోగించి సత్ఫలితాలు సాధిస్తున్నామని, అదే తరహాలో లీగల్ గవర్నెన్స్, లిటిగేషన్ మేనేజ్మెంట్ కోసం త్వరలోనే ‘లీగల్ ఏఐ స్టాక్’ను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆన్లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 8.4 లక్షల కేసులను నిర్వహిస్తున్నామని, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా యూనిఫైడ్ డిజిటల్ లా రిపాజిటరీ, జీఓలు, కేస్ రికార్డుల నిర్వహణతో పాటు ఏఐ కేస్ అనాలసిస్, కౌంటర్ అఫిడవిట్ల తయారీ సులభతరం అవుతుందన్నారు.
కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్‌లతో పాటు ఆర్బిట్రేషన్, మీడియేషన్ విధానాలను విస్తృతంగా వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సంబంధిత కేసులను న్యాయస్థానాల సహకారంతో త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సామాన్యులకు సకాలంలో న్యాయం అందేలా న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

